రమేష్‌ను టార్గెట్ చేస్తున్న మోదీ సేన.. అసలు కారణం ఇదే..?

నాని జెర్సీ సినిమా ప్రారంభ ఫోటోలు
October 17, 2018
పట్టాలు దాటితే కటకటాలే…
October 17, 2018

రమేష్‌ను టార్గెట్ చేస్తున్న మోదీ సేన.. అసలు కారణం ఇదే..?

ఎంపీ సీఎం రమేశ్‌ని ఐటీ టార్గెట్ చేయడం వెనుక ఏ రాజకీయ కుట్ర దాగివుంది? ఇందులో ఎవరెవరి హస్తాలున్నాయి? సీఎం రమేశ్‌ ఆస్తులపై జరిపిన సోదాల్లో ఐటీ అధికారులు తేల్చిందేంటి? సీఎం రమేష్‌ మోదీకి ఎందుకు కంటగింపుగా మారారు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
      కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్‌ కేంద్రంలోని నరేంద్రమోదీ సేనకు ఇప్పుడు కీలక శత్రువుగా మారారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితులపై కేంద్రం గురిపెట్టిన తరుణంలో సీఎం రమేశ్‌ టార్గెట్‌గా ఆదాయపు పన్నుశాఖ అధికారులు కదిలారు. ఆయన ఇంటిపై, ఆస్తులపై రోజుల తరబడి సోదాలు జరిపారు. చివరికి వారికి ఏం దొరికిందో తెలియదు కానీ.. ఈ సోదాల వెనుక ఏ రాజకీయం దాగిఉందో ప్రజలు మాత్రం ఓ అభిప్రాయానికి వచ్చారు.
    ప్రధాని నరేంద్రమోదీ సేనకు సీఎం రమేశ్‌ టార్గెట్‌ కావడానికి కారణం తెలిసిందే! నిండు పార్లమెంట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై రమేశ్‌ గొంతెత్తారు. కేంద్రప్రభుత్వ చేసిన నిర్వాకంపై చట్టసభలో ఎండగడుతున్నారు. అంతేకాదు.. బీజేపీతో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకున్నాక కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాల్లో కూడా సీఎం రమేశ్‌ది కీలకపాత్ర! ఆ తర్వాత కూడా రమేష్ వరుసగా నాలుగైదు సందర్భాల్లో కేంద్రానికి తలనొప్పిగా మారాడన్నది బీజేపీ పెద్దల అభిప్రాయం. పార్లమెంట్‌ సెషన్స్‌ జరిగిప్పుడే కాదు- మమూలు సమయాల్లో కూడా విభజన చట్టం అమలుపై ఆయన కేంద్రాన్ని నిలదీస్తున్నారు. ఈ పరిణామాలేవీ కమలనాథులకు రుచించలేదు. ఇదే సమయంలో ఈ మధ్యనే కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం గట్టిగా గళమెత్తారు.
    కేంద్రంపై పోరాటంలో భాగంగా కడప నుంచే ఉద్యమం ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశంతో సీఎం రమేశ్‌ స్పందించారు. కడపలో ఉక్కుదీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా 11 రోజులపాటు నిరాహారదీక్ష చేశారు. ఈ దీక్షకు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా స్పందనొచ్చింది. అన్ని పార్టీల నేతల మద్దతు లభించింది. ఉక్కదీక్ష సందర్భంగా సీఎం రమేశ్‌ ఆరోగ్యం విషమించింది. అయినప్పటికీ కేంద్రం స్పందించలేదు. విధిలేని పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు కడప వచ్చి ఆయనతో దీక్షను విరమింపచేశారు. ఉక్కుదీక్ష ఏపీ పట్ల కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని సీఎం రమేశ్‌ ప్రపంచానికి చాటిచెప్పారు. దీంతో బీజేపీ పెద్దలకు శత్రువుగా మారారు.
    ఇంతటితో రమేశ్‌ ఊరుకోలేదు. ఇటీవల ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులు కక్షపూరితమైనవనీ, దీనికి సమాధానం చెప్పాలనీ కోరుతూ సంబంధిత కేంద్రశాఖకు నోటీసులు పంపారు. ఇది జరిగిన మూడవ రోజునే సీఎం రమేశ్‌ ఇల్లు, ఆస్తులపై ఐటీ అధికారులు విరుచుకుపడ్డారు. తాజా దాడులకు నేపథ్యం ఇలా ఉండగా.. తనపై ఇంత త్వరగా ఐటీ సోదాలకు పురికొల్పిన అంశం మరొకటి ఉందని సీఎం రమేశ్‌ వాదిస్తున్నారు. ఎప్పటినుంచో సీఎం చంద్రబాబుపైనా, ఆయన సన్నిహిత నేతల పైనా కక్షతో రగిలిపోతున్న వైసీపీ అధినేత జగన్‌, ఆయన ప్రతినిధుల ప్రోద్బలంతోనే కేంద్రం ఈ దాడులు చేయించిందని రమేశ్‌ చెబుతున్నారు. ఆయన వాదనతో టీడీపీకి చెందిన ముఖ్య నేతలు కూడా ఏకీభవిస్తున్నారు.
     కేంద్ర బీజేపీ పెద్దలతో లోపాయికారీ బంధాన్ని కొనసాగిస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఈ మొత్తం వ్యవహరంలో కీలక భూమిక పోషించారని రమేశ్‌ ఆరోపిస్తున్నారు. కడపలో స్టీల్‌ప్లాంట్‌ గురించి దీక్ష చేయడంతో జగన్‌కీ, ఆయన పార్టీ నేతలకీ అస్తిత్వ సమస్య వచ్చింది. దీంతో సీఎం రమేశ్‌పై వెంటనే దాడులు జరిగేలా వైఎస్‌ జగన్‌ విజయసాయిరెడ్డి ద్వారా ఈ కేంద్ర బీజేపీ పెద్దలపై వత్తిడి తెచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఈ దాడుల వెనుక విజయసాయిరెడ్డి పాత్ర ఉందని సీఎం రమేశ్‌ కూడా ఆరోపించడం గమనార్హం!
   ఇకపోతే.. కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలంలో సీఎం రమేశ్‌ స్వగ్రామమైన పోట్లదుర్తితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఆయన కంపెనీలు, కార్యాయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తంమీద సీఎం రమేశ్‌ను ఐటీ టార్గెట్ చేయడం వెనుక ఎవరెవరి పాత్ర ఉందో ప్రజలు గ్రహించే రోజులొచ్చాయి. ఈ పరిణామం ఎన్నికలపైనా ప్రభావం చూపనుంది!

Leave a Reply

Your email address will not be published.

//]]>