పవన్‌తో నాదెండ్ల స్నేహానికి కారణం ఎవరు…?

కన్నీళ్లు ఆగలేదు…శ్రీశాంత్‌
October 17, 2018
మీరెక్కడున్నారు?….కేటీఆర్‌
October 17, 2018

పవన్‌తో నాదెండ్ల స్నేహానికి కారణం ఎవరు…?

పవన్‌తో నాదెండ్ల స్నేహానికి కారణం ఎవరు.. జనసేన టార్గెట్‌లో పలువురు?

జనసేన నూతన రాజకీయాలకు తెరలేపింది. భావసారూప్యత కలిగిన వేరే సామాజికవర్గానికి చెందిన కొందరిని పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహం రచించింది. ఒకే సామాజికవర్గానికి జనసేన పరిమితమైందనే భావనను పోగొట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందుకు రాజకీయ చైతన్యానికి మారుపేరైన గుంటూరు జిల్లాని కేంద్రంగా చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో అసలేం జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకోండి.
     జనసేన ఫక్తు రాజకీయ పార్టీగా మారింది. ఇక ఎన్నికల రాజకీయాలకు దిగాలని నిర్ణయించారు. అందుకోసమే అన్ని వర్గాల సమాహారంగా పార్టీని తీర్చిదిద్దాలని జనసేన అధినేత భావిస్తున్నారు. 2014కి ముందు శాసనసభ స్పీకర్‌గా ఉండి, రాజకీయ చాణక్యత ప్రదర్శించి, వివాదాలకు అతీతంగా వ్యవహరించిన నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసినప్పటికీ కాంగ్రెస్ తరఫున నాదెండ్ల మనోహర్ పోటీచేశారు. మెడలో మూడు రంగుల కండువా ధరించి ఫక్తు కాంగ్రెస్ నేతగా దర్శనమిచ్చే నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరడం కాంగ్రెస్‌వాదులకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే గతంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌పార్టీ నేతల నుంచి ఎన్నిసార్లు ఆహ్వానం వచ్చినప్పటికీ నాదెండ్ల మనోహర్ స్పందించలేదు. అలాంటి నేత అకస్మాత్తుగా జనసేనలో చేరడం పలువురిని విస్మయపరిచింది.
     నాదెండ్ల మనోహర్‌ను జనసేనపార్టీలో చేర్చుకోవడం వెనుక విజయవాడకు చెందిన ఒక పారిశ్రామికవేత్త మధ్యవర్తిత్వం నెరిపారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ పారిశ్రామికవేత్త అటు మనోహర్‌కీ, ఇటు పవన్కీ కూడా సన్నిహితుడే. ఏ ఉద్దేశంతో మనోహర్ జనసేనలో చేరారో తెలియదు కానీ.. ఈ పరిణామం వల్ల పవన్‌కల్యాణ్‌కు రెండు ప్రయోజనాలు నెరవేరాయి. జనసేన పార్టీ ఒకే సామాజికవర్గానికి పరిమితమైందనే భావన ఈ ఘటనతో సమసిపోయిందని జనసైనికులు అంటున్నారు. రెండవది నాదెండ్ల మనోహర్ వివాదాలకు దూరంగా ఉంటారు. నిజాయితీపరుడు. అన్నింటికీ మించి ఆలోచనాపరుడు. ఆయన తత్వం వల్ల పవన్‌తో చేరువయ్యే అవకాశముందనీ, ఏపీ రాజకీయాల్లో జనసేన ఇక స్పష్టమైన విధానంతో ముందుకు వెలుతుందనీ ఆ పార్టీ నేతలు కొందరు భావిస్తున్నారు.
     మనోహర్‌తో పాటు గుంటూరు జిల్లాలకు చెందిన మరికొంతమంది నేతలకు జనసేన, వైసీపీలు వల విసిరాయి. రేపల్లె మాజీ ఎమ్మల్యే దేవినేని మల్లిఖార్జునరావును రెండు పక్షాలు సంప్రదించాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న దేవినేని మల్లిఖార్జునరావును ఆ పార్టీ పెద్దలు పట్టించుకోలేదన్న భావన ఆయన అనుచరుల్లో ఉంది. అటు రేపల్లె, ఇటు వేమూరు నియోజకవర్గాల్లో మల్లిఖార్జునరావుకు పట్టు ఉంది. ఇక చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్‌ను ఆ నియోజకవర్గ సమన్వయకర్త పదవి నుంచి పార్టీ అధ్యక్షులు జగన్ ఆకస్మికంగా తప్పించారు. కేవలం డబ్బులు లేవనే సాకుతోనే ఆయనను ఆ పదవి నుంచి తొలగించారన్నది పలువురి అభిప్రాయం. దీంతో ఆయన అనుచరులు పార్టీకి రాజీనామా చేసి నిరసన వ్యక్తంచేశారు. ఈ తరుణంలో రాజశేఖర్‌ను జనసేన పార్టీ నేతలు సంప్రదించినట్టు సమాచారం.
     పూర్వాశ్రమంలో నాదెండ్ల మనోహర్, మర్రి రాజశేఖర్ కాంగ్రెస్‌పార్టీలో కలిసి పనిచేశారు. వైసీపీలోని కొంతమంది నేతలు తొందరపడవద్దంటూ మర్రి రాజశేఖర్‌కి సలహా ఇచ్చినట్టు సమాచారం. తాము జగన్‌తో మాట్లాడుతామని చెప్పారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డిని కూడా జనసేన సంప్రదించినట్లు వినికిడి. అయితే ఆయన వైపునుంచి ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదని అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా కోస్తాలో అత్యంత కీలకమైన గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో కూడా జనసేనను సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు నాదెండ్ల మనోహర్ సారథ్యంలో జనసేన పావులు కదుపుతోంది. రాజకీయాల్లో ఉండి, మంచి పేరున్న నేతలను పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందనీ, పూర్తిగా కొత్తవారితో ఎన్నికలకు వెళితే దెబ్బతింటామనే వాదన జనసేనలో వినిపిస్తోంది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం పావులు కదుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.

//]]>