పదేళ్లు వెనక్కి నెట్టేసింది: ఉద్దానం కొబ్బరి రైతుల ఆవేదన

19న జనసేనలో చేరిక: సుందరపు విజయకుమార్‌
October 15, 2018
తుపాను బాధిత ప్రాంతాల్లో అల్లాడుతున్న జనం: 20 లీటర్ల తాగునీటి క్యాన్‌ రూ.100
October 15, 2018

పదేళ్లు వెనక్కి నెట్టేసింది: ఉద్దానం కొబ్బరి రైతుల ఆవేదన

తిత్లీ దాటికి 90% తోటలు ధ్వంసం, 

మళ్లీ మొక్కలు నాటినా ఏడెనిమిదేళ్ల వరకూ కాపు రాదు

శ్రీకాకుళం, విజయనగరం: ఉద్దానానికి అన్నం పెట్టేది కొబ్బరి చెట్లేనన్నది నానుడి. వేలాది రైతు కుటుంబాలకు అదే జీవనాధారం. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, పెళ్లిళ్లు అన్నింటికీ కొబ్బరి పంటే కొండంత అండ. అలాంటి కొబ్బరి తోటలన్నింటినీ తిత్లీ తుపాను ఒక్క దెబ్బతో తుడిచిపెట్టేసింది. దాదాపు 90 శాతం కొబ్బరి తోటలు కకావికలమైపోయాయి. ఇప్పటికే అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతన్న తోటల్లో కూలిన చెట్లను ఖాళీ చేయించుకోవడానికీ కొత్తగా అప్పులు చేయాల్సిందే. మళ్లీ కొత్తగా మొక్కలు నాటుకున్నా ఆ పంట రావడానికి ఏళ్లు పడుతుంది.

ఉద్దానం, పరిసర మండలాల్లో దాదాపు 40,000 ఎకరాల్లో కొబ్బరి సాగు చేస్తున్నారు. ఇక్కడి కొబ్బరిని ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. సాధారణంగా ఎకరానికి 80 నుంచి 90 చెట్లుంటాయి. అలాంటిది అత్యధిక తోటల్లో కనీసం ఒకటి రెండు చెట్లైనా మిగలని పరిస్థితి నెలకొంది. ఒక కొబ్బరి మొక్క నాటిన తరువాత కనీసం ఏడెనిమిదేళ్లకుగానీ కాపు మొదలు కాదు. అప్పటి నుంచి దాదాపు మూడు నాలుగు దశాబ్దాల వరకూ ఏడాదికి ఆరు విడతలుగా కాయలనిస్తుంది. ఎకరానికి ఏడాదికి దాదాపు రూ.72,000 వరకూ ఆదాయం వస్తుంది. అయితే ప్రస్తుతం తగిలిన దెబ్బతో రైతుకు ఆదాయం పోవడంతో పాటు అదనంగా అప్పులు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ఇప్పటివరకూ ఉన్న అప్పుల్నే తీర్చలేని స్థితిలో ఉన్న రైతన్నకు కొత్త అప్పులు ఎలా పుడతాయన్నది ప్రశ్నార్థకమే. తోటల్లో కూలిపోయిన చెట్లను తొలగించడానికే ఎకరాకు కనీసం రూ.10,000కు తక్కువ కాకుండా ఖర్చు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఉద్దానంలో కొబ్బరి రైతుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. 1999లో వచ్చిన సూపర్‌సైక్లోన్‌ మొదలు, 2013లో ఫైలిన్‌, 2014లో హుద్‌హుద్‌ తుపాన్లు వణికించాయి. తాజాగా విలయతాండవం చేసిన తిత్లీ కొబ్బరి రైతును పదేళ్లు వెనక్కి నెట్టేసింది. ఏ పంటకైనా ప్రకృతి ప్రకోపిస్తే ఒకసారే నష్టపోతారు. కాని కొబ్బరి రైతు పరిస్థితి అలాంటిది కాదు. కొత్తగా మొక్కలేసి కాపు మొదలు కావడానికే ఏడెనిమిదేళ్లకుపైగా సమయం పడుతుంది. మరోవైపు తోటల్లో ఏ కాసిన్ని మొక్కలు మిగిలినా, అవీ మొవ్వులు మెలి తిప్పేయడంతో కుళ్లు తెగులు తదితర చీడపీడలు చుట్టుముట్టేస్తుంటాయి. వాటి ప్రభావం దిగుబడులపైనా పడుతుంది. అందుకే ప్రభుత్వం గట్టి సాయం చేయకపోతే ఉద్దానం కొబ్బరి రైతు వలసపోయే ప్రమాదమూ లేకపోలేదు.

పిల్లల్ని ఎలా చదివించాలో తెలియట్లేదు 
మా ఎకరంన్నర తోటలో పది చెట్లు కూడా మిగల్లేదు. చేసిన అప్పు రూ.40,000 అలాగే ఉండిపోయింది. ఇప్పుడు చెట్లు తొలగించడానికే మళ్లీ రూ.వేలు ఖర్చు చేయాలి. తోట ఆధారంగానే పిల్లల్ని చదివించుకుంటున్నా. ఇప్పుడు వారిని పాఠశాలలకు పంపాలో తెలియట్లేదు.

– బత్తిన పద్మావతి, కొబ్బరి రైతు, గరుడభద్ర
ఒక్క చెట్టూ మిగల్లేదు 
ఎకరా తోటలో కొబ్బరి వేస్తే ఒక్క చెట్టూ మిగల్లేదు. హుద్‌హుద్‌ కొట్టిన దెబ్బ నుంచే నేనింకా కోలుకోలేదు. అలాంటిది ఇప్పుడు మళ్లీ తోటంతా నేలమట్టమైపోయింది. ప్రభుత్వం ఆదుకుంటేనే మాకు జీవనాధారం.

– మడ్డు పూర్ణారావు, కొబ్బరి రైతు, డోకులపాడు
231 చెట్లకు ఒక్కటే మిగిలింది 
నేను మూడున్నర ఎకరాల్లో కొబ్బరి వేశా. రాకాసి తుపాను దాటికి 231 చెట్లకుగానూ ఒక్కటే మిగిలింది. షావుకారు దగ్గర తెచ్చిన రూ.60,000 అప్పు తీర్చలేని పరిస్థితి. ఇక వలస వెళ్లడమే తప్ప మరో మార్గం కనిపించట్లేదు.

– పప్పు నారాయణ, కొబ్బరి రైతు, డోకులపాడు

 

Leave a Reply

Your email address will not be published.

//]]>