కేసీఆర్ హామీల వర్షం

మీరెక్కడున్నారు?….కేటీఆర్‌
October 17, 2018
హైదరాబాద్‌లో వర్ష బీభత్సం
October 17, 2018

కేసీఆర్ హామీల వర్షం

  • నిరుద్యోగ భృతి…రూ.3,016
  • కేసీఆర్ హామీల వర్షం
  • రూ.లక్ష వరకూ మళ్లీ పంట రుణమాఫీ
  • వృద్ధులకు నెలకు రూ.2016 పింఛను
  • దివ్యాంగుల పింఛను 3016కు పెంపు
  • ఆసరా వయోపరిమితి ఇకపై 57 ఏళ్లే
  • రైతు బంధు కింద ఏటా రూ.10 వేలు
  • సొంత జాగాలోనూ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు
  • రెడ్లకు, వైశ్యులకు కార్పొరేషన్లు, ఫండ్‌
 
 
 ఈసారి ఎవర్నీ వదలం
టీఆర్‌ఎస్‌ పాలన అవినీతి రహితం. అవినీతి
జరిగితే ఎప్పుడో బయటపడేది.గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నపుడు విచ్చలవిడిగా అవినీతి జరిగింది. కాంగ్రెస్‌ చేసిన కుంభకోణాలన్నీ తెలుసు. రాజకీయ కక్ష సాధిస్తున్నాం అంటారని ఈ నాలుగేళ్లలో ఎవర్నీ ముట్టుకోలేదు. మళ్లీ అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలబోం. – కేసీఆర్‌
 
2 నియోజకవర్గాలకో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌
70-80ు రాయితీతో మహిళా సంఘాలకు
రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ వేతనం
ఉద్యోగులకు ఐఆర్‌.. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాలు
 
ఈరోజుతో ఆ బాధ తీరింది
అందరికంటే ముందుగా అభ్యర్థులను మేమే ప్రకటించాం. మా వాళ్లంతా అందరికంటేముందు ప్రచారంలోకి వెళ్లిపోయారు. ఇంతకాలం ఏం చేశామో చెబుతున్నారు. కానీ వచ్చే ఐదేళ్లలో ఏం చేయబోతున్నామో చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు మేనిఫెస్టో ప్రకటించడంతో వారి బాధ తీరుతుంది. కేసీఆర్‌
 
రాష్ట్రంపై సంపూర్ణ అవగాహన ఉంది
‘‘తెలంగాణను సాధించిన పార్టీగా టీఆర్‌ఎస్‌కు రాష్ట్రంపై సంపూర్ణ అవగాహన ఉంది. ఏం చెప్పినా ఆషామాషీగా, అడ్డం పొడుగుగా చెప్పడానికి లేదు. బాధ్యతగా చెప్పాల్సి ఉంటుంది.’’
 
ఎన్నికలు మాకు ఒక టాస్క్‌
‘‘ఎన్నికలంటే మిగతా రాజకీయ పార్టీలకు పొలిటికల్‌ గేమ్‌, టీఆర్‌ఎస్‌కు మాత్రం ఒక టాస్క్‌.. నిర్దిష్టమైన లక్ష్యాలు, గమ్యాలపై చాలా స్పష్టంగా ఆలోచించి ముందుకు పోతాం.. చెప్పిన దానిని చాలా పాజిటివ్‌గా అమలు చేస్తాం’’
 
తెలంగాణ ప్రజలపై ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు హామీల వర్షం కురిపించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3016 ఇస్తామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే రైతులకు మరోసారి రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రైతుబంధు పథకం కింద ఒక్కో పంటకు ఎకరానికి ఇస్తున్న సాయాన్ని రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతామని, ఏడాదికి పదివేలు చేస్తామని హామీ
ఇచ్చారు. ఆసరా వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గించడం, ఆసర పింఛన్‌ను రూ.1000నుంచి రూ.2016కు పెంచడం, దివ్యాంగుల పింఛనును రూ.1500నుంచి రూ.3016కు పెంచడం వంటి పలు కీలక హామీలనిచ్చారు. ఇచ్చిన హామీలన్నింటిని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని వెల్లడించారు. నిరుద్యోగ భృతి మాత్రం రెండు మూడు నెలల ఆలస్యమవుతుందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పాక్షిక మేనిఫెస్టోను మంగళవారం సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ప్రజలు కోరుతున్నవి, ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రజలు చేసిన విజ్ఞాపనలు, ఈ నాలుగేళ్లలో తన అనుభవాలే ప్రధానాంశాలుగా టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను రూపొందించామని ఆయన వెల్లడించారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ కె.కేశవరావు, సభ్యులతో కలిసి మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు.
 
 
నిరుద్యోగ భృతి రూ.3016
రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు రూ.3016 భృతి అందజేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు.‘‘ గతంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేతో రాష్ట్రవ్యాప్తంగా 11-12 లక్షల మంది నిరుద్యోగులు ఉండవచ్చని అంచనా. వీరే కాదు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా అందరికీ నెలకు రూ.3016 నిరుద్యోగ భృతి అందిస్తాం. అసలు నిరుద్యోగులు ఎవరు అని గుర్తించడమనేది పెద్ద సమస్య. ప్రస్తుతం ఇది రెండు మూడు రాష్ట్రాల్లో అమల్లో ఉన్నందున అక్కడ కూడా అధ్యయనం చేస్తాం’’ అని కేసీఆర్‌ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలు కాగానే పంచాయతీ ఎన్నికలు, తర్వాత సాధారణ ఎన్నికలు ఉన్నాయని, ఇవన్నీ పూర్తయ్యేందుకు కాస్త సమయం పడుతుందని కేసీఆర్‌ పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉన్నందున నిరుద్యోగ భృతి ఇవ్వడం మూడు నాలుగు నెలలు ఆలస్యమైనా ఇచ్చి తీరుతామని చెప్పారు.
 
 
లక్ష రుణమాఫీ
గత ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేసిన విధంగానే రైతులకు మరోసారి లక్ష వరకు రుణమాఫీ చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ‘‘ ముందు భవిష్యత్తులో రైతులు రాజులు కావాలంటే ఇంకా పటిష్ఠంగా వారిని కొద్ది రోజులు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుల నుంచి బయటపడి తమ పెట్టుబడి తామే పెట్టుకునే స్వయంశక్తి రైతులకు సమకూరే వరకు వాళ్లకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈసారి కూడా రాష్ట్రంలో 45 లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నా రు. అందులో ఒక లక్షలోపు అప్పు కలిగిన వాళ్లు 42 లక్షల మంది పైచిలుకు ఉన్నారు. పోయినసారి లాగే ఈసారి కూడా ప్రతి రైతుకూ లక్ష వరకు రుణమాఫీ చేస్తాం. గతంలోలాగా సమస్యలు రాకుండా త్వరితగతిన ఒకటి రెండు వాయిదాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చెల్లిస్తాం’’ అని వివరించారు.
 
 
రైతు బంధు.. పంటకు రూ.5వేలు
రైతుబంధు పథకంలో ప్రస్తుతం పంటకు ఇస్తున్న రూ. 4వేలను రూ.5 వేలకు పెంచుతామని.. అంటే ఏడాదికి రెండు పంటలకు కలిపి ప్రస్తుతమిస్తున్న రూ.8వేలను రూ.10వేలు చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ‘‘రైౖతు బంధు చాలా మంచి పథకం. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. అశోక్‌ గుహ్లాటీ, స్వామినాథన్‌ వంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా దీన్ని ప్రశంసించారు’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. రైతుబీమా పథకాన్ని కొనసాగిస్తామని, ఒక్క గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా అతడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందిస్తామని చెప్పారు.
 
 
ఎస్‌హెచ్‌జీలకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు
ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒకటి లేదా రెండు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ‘‘రైతులు పండించే పంటలకు మంచి ధర అందించాలన్నది సర్కారు లక్ష్యం. దాంతోపాటు రైతుల ఆదాయం పెంచేందుకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ప్రారంభిస్తాం. దీని నిర్వహణ బాధ్యతలను 70-75 శాతం రాయితీపై మహిళా సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కు అందిస్తాం.వీరికి ఐకేపీ ఉద్యోగులు సహకరిస్తారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. మహారాష్ట్రలో చిన్న సంఘంగా ప్రారంభమైన లిజ్జత్‌ పాపడ్‌ నేడు వందల కోట్ల వ్యాపారం చేస్తోంది. రాష్ట్రంలోని సంఘాలను కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది’’ అని కేసీఆర్‌ వివరించారు. రైతు సమన్వయ సమితులకు గౌరవ వేతనం ఇవ్వాలని కమిటీ సూచించిందని, విధివిధానాలు రూపకల్పన చేసిన తర్వాత ఎంత ఇవ్వాలనేది నిర్ణయిస్తామని చెప్పారు.
 
 
పింఛన్లు రెట్టింపు..
ఆసరా పథకం కింద ప్రస్తుతం వృద్ధులు అందుకుంటున్న పింఛనును రెట్టింపు చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ‘‘ప్రస్తుతం 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నాం. దీనిపై అనేక విజ్ఞప్తులు అందాయి. మాకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసులా పెట్టాలని చాలా మంది కోరారు. ప్రస్తుతమున్న పింఛన్‌ను రూ.2 వేలుకు పెంచితే బాగుంటుదని, తాము ఎవరిమీదా ఆధారపడకుండా బతుకుతామని ఓ ముస్లిం మహిళ లేఖ రాసింది. మేం మళ్లీ అధికారంలోకి వస్తే ఇప్పుడిస్తున్న ఆసరా పింఛన్ల కనీస వయసు 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తాం. అలాగే ప్రస్తుతమిస్తున్న రూ.1000 పింఛను రూ.2016, వికలాంగులకు రూ.1500 పింఛనును రూ.3016 చేస్తాం. ప్రస్తుతం 40 లక్షల మందికి పింఛన్లు ఇస్తుండగా.. వయసు తగ్గించడంతో మరో 8 లక్షల మంది లబ్ధి పొందుతారు’’ అని ఆయన వివరించారు.
 
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాలు..
రూ.3-4 వేల కోట్లు పెట్టి యాదవులకు గొర్లు, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తమకు కూడా ప్రత్యేక పథకాలు అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీలు కోరుతున్నారని కేసీఆర్‌ చెప్పారు. ఇప్పటికే వారికి సబ్‌ప్లాన్‌ పేరుతో ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని, వాటితోపాటు స్పెషల్‌ గ్రోత్‌ ఇంజన్‌లా మరిన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి పథకాలు ఉండాలో కడియం శ్రీహరి అధ్యక్షతన ప్రత్యేక కమిటీ నిర్ణయిస్తుందన్నారు. ఎస్సీలకు రూ.10-15 వేల కోట్లు, గిరిజనులకు రూ.6-10వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు.
 
 
అగ్రవర్ణాల పేదలకు కార్పొరేషన్‌
అగ్రవర్ణాల్లోనూ పేదలున్నారని, వారి అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని చాలామంది విజ్ఞప్తి చేశారని కేసీఆర్‌ చెప్పారు. ఆర్యవైశ్యులకు, రెడ్లకు కార్పొరేషన్‌, ప్రత్యేక కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
 
 
ఉద్యోగులకు ఐఆర్‌
రాష్ట్రంలోని అనేక విభాగాల్లో ప్రభుత్వ తాత్కాలిక, పొరుగుసేవల ఉద్యోగులు సగం కడుపులతో సతమతం అవుతున్నారన్న విషయం గ్రహించే భారీగా జీతాలు పెంచామని కేసీర్‌ అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ట్రాఫిక్‌ పోలీసులకు 30శాతం రిస్క్‌ అలవెన్స్‌ ఇస్తున్నామని, అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు, హోంగార్డులకు అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువ జీతాలు అందిస్తున్నామని చెప్పారు. మరోసారి అందరూ ఆశీర్వదిస్తే వారి కడుపు నింపుతామని హామీ ఇచ్చారు. ఒకే ప్యాకేజీ కింద ఉన్న చిన్న ఉద్యోగుల సర్వీస్‌ క్రమబద్ధీకరణ, వేతనాల పెంపును చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మధ్యంతర భృతి పెంచుతామని హామీ ఇచ్చారు.
 
 
సొంత జాగాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు..
డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకం కొనసాగుతుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.. మూడు కేటగిరీల్లో ఈ పథకం కొనసాగుతుందని చెప్పారు. ‘‘ఎన్టీఆర్‌ కాలం నుంచీ చూస్తున్నా ఇళ్ల సమస్య ఇలాగే ఉంది. ఆయన హయాంలో కూడా పేదలు ఎంతమంది, ఎంతమందికి ఇళ్లు కట్టాలన్న అంశంపై అధ్యయనం జరిగింది. కొన్ని చోట్ల ఇప్పటికే అక్కడున్న పేదల కుటుంబాల కంటే అధికంగా ఇళ్లు కట్టారు. సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చిన వివరాల ఆధారంగా రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు కట్టాలనే అంశంపై మాకు ఓ క్లారిటీ ఉంది. దానిప్రకారం ఇళ్లు నిర్మిస్తున్నాం. రెండు తరాలకు ఉపయోగపడాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 2.60 లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పిల్లర్లతో నిర్మిస్తున్నాం. ఇది కాంగ్రెసోళ్లు కట్టిన 18 లక్షల డబ్బా ఇళ్లతో సమానం. ఈ పథకాన్ని కొనసాగిస్తాం. అలాగే సొంత జాగా ఉన్నవారికి ఆ జాగాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తాం. సొంతంగా ఇల్లు కట్టుకుంటామన్నవారికీ రూ. 3-4 లక్షల సాయం అందిస్తాం.’’ అని వివరించారు.
 
 
100శాతం అమలుచేస్తాం..
తమ మేనిఫెస్టో పక్కాగా ఉందని దీనిని వంద శాతం అమలుచేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ‘‘గతంలోనూ మేము తక్కువ చెప్పాం ఎక్కువ చేశాం. కొత్త జిల్లాలు ఏర్పాటుచేశాం. అదనంగా నాలుగువేల గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశాం. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాం. గత నాలుగేళ్లలో రాష్ట్ర వృద్ధి రేటు 17.17 శాతం ఉండగా, ఈ ఏడాది 19.70 శాతంగా ఉంది. వచ్చే ఏడాది మరింత పెరుగుతుంది. హామీల అమలుకు నిధుల సమస్య ఎదురవ్వదు. డిసెంబరులో ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హామీలకు వచ్చే బడ్జెట్టులో నిధులు సమకూర్చి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తాం’’ అని కేసీఆర్‌ ప్రకటించారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని, గతంలో కాంగ్రెస్‌ ఇచ్చిన మేనిఫెస్టోలా కాదని కేసీఆర్‌వ్యాఖ్యానించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని 2009 మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్‌ నెరవేర్చలేదు. గ్యాస్‌ ధర సగం తగ్గిస్తామని చెప్పి రెట్టింపు పెంచారు. రూ. 261 నుంచి రూ. 479 పెంచారు. పింఛనును పెంచుతామన్న మేరకు పెంచలేదు.’’ అని కేసీఆర్‌ విమర్శించారు.
 
ఈరోజుతో బాధ తీరింది..
అందరికంటే ముందుగా అభ్యర్థులను తామే ప్రకటించామని, వాళ్లంతా అందరికంటేముందు ప్రచారంలోకి వెళ్లిపోయారని కేసీఆర్‌ అన్నారు. ఇంతకాలం ఏం చేశామో చెబుతున్నారని, కానీ వచ్చే ఐదేళ్లలో ఏం చేయబోతున్నామో చెప్పలేకపోతున్నారని చెప్పారు. ఇప్పుడు మేనిఫెస్టో ప్రకటించడంతో వారి బాధ తీరుతుందని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published.

//]]>