తుపాను బాధిత ప్రాంతాల్లో అల్లాడుతున్న జనం: 20 లీటర్ల తాగునీటి క్యాన్‌ రూ.100

పదేళ్లు వెనక్కి నెట్టేసింది: ఉద్దానం కొబ్బరి రైతుల ఆవేదన
October 15, 2018
మలింగ బాగోతాన్ని బయటపెట్టిన చిన్మయి
October 15, 2018

తుపాను బాధిత ప్రాంతాల్లో అల్లాడుతున్న జనం: 20 లీటర్ల తాగునీటి క్యాన్‌ రూ.100

20 లీటర్ల తాగునీటి క్యాన్‌ రూ.100 
తుపాను బాధిత ప్రాంతాల్లో అల్లాడుతున్న జనం 

విజయనగరం: శ్రీకాకుళం జిల్లాలో గొంతు తడుపుకొందామంటే గుక్కెడు నీరు దొరకడం లేదు. తుపాను దెబ్బకు నీరు దొరక్కపోవడంతో ఇదే అదనుగా కొందరు మంచినీటికి భారీ ధరలు పెట్టి అమ్మేస్తున్నారు. కంచిలి, కవిటి, వజ్రపుకొత్తూరు, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం, మందస తదితర 12 మండలాల్లో విద్యుత్తు వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడంతో నీటి వనరులు పనిచేయడం లేదు. బాధిత ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. ప్రధానంగా ఉద్దానం మంచినీటి ప్రాజెక్టులు రెండింటితోపాటు తురకశాసనం రక్షిత మంచినీటి పథకం, మరో 19 సీపీడబ్ల్యూ పథకాలు, 377 పీడబ్ల్యూఎస్‌ పథకాలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 240 పథకాలను పునరుద్ధరించినట్లు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అదెక్కడా కనిపించడం లేదు. కొన్నిచోట్ల జనరేటర్లు పెట్టి మోటార్ల ద్వారా మంచినీటి ట్యాంకులను నింపే ప్రయత్నాలు జరుగుతున్నా కొద్ది ప్రాంతాలకే పరిమితమైంది. తాగడానికే నీళ్లు ఉండటం లేదని చాలామంది స్నానాలే మానేశారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వస్తున్న తాగునీటి ట్యాంకర్లు, అగ్నిమాపక శాఖ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్నా అందరికీ చేరటం లేదు. పలాస మండలంలోని సుమ్మాదేవి, మామిడిపల్లి, వజ్రపుకొత్తూరు మండలంలోని మర్రిపాడు, మందస మండలంలోని మకరజోల, సోంపేట మండలంలోని మరికొన్ని గ్రామాలు, పాతపట్నం, కొత్తూరుల్లో తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కారు. వజ్రపుకొత్తూరులోని అక్కుపల్లిలో బురదనీరు ఇస్తున్నారంటూ ట్యాంకరు తీసుకొచ్చినవారిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
ప్రజల ఇబ్బందులను సొమ్ము చేసుకుంటూ కొందరు ప్రైవేటు వ్యాపారులు చెలరేగిపోతున్నారు. చాలా గ్రామాల్లో రూ.10కి అమ్మే 20 లీటర్ల మంచినీటి క్యానుకు రూ.50 నుంచి రూ.100 వరకూ వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నా అది ఏ మూలకూ సరిపోవడం లేదు. జనరేటర్లు అద్దెకు తెచ్చుకుని మోటార్ల ద్వారా ఇళ్లపై ట్యాంకులను నింపుదామంటే.. ఒక్క దఫాకు వ్యాపారులు రూ.1000 అడుగుతున్నారు. సొమ్ములు పెడదామన్నా చాలాచోట్ల జనరేటర్లే దొరకటం లేదు. కొన్ని చోట్ల ఎన్టీఆర్‌ సుజలధార నీళ్లు అందుతున్నాయి.

పెళ్లి భోజనాలకు నీళ్లు లేవు 
తుపానువల్ల రక్షిత మంచినీటి పథకం ద్వారా వచ్చే నీరు ఆగిపోయింది. ఇంట్లో మా అబ్బాయి పెళ్లికి వెయ్యి మందిని పిలిచాం. వారందరికీ భోజనాలు పెట్టేందుకు నీళ్లు లేవు. అందుకే పక్కనే ఉన్న బావిలోంచి నీటిని తోడి వడకట్టి అందిస్తున్నాం. జనరేటరు తీసుకొచ్చి మరికొంత నీటిని సమకూర్చుకున్నాం.

– బి.ఆనందస్వామి, పెళ్లి కుమారుడి తండ్రి, బెండి

నీటి కోసమే ఇంటికొకరు.. 
తాగునీటి కోసం నాలుగైదు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. ఇంటికొకరు ఇదే పనిమీద ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం త్వరగా విద్యుత్తు సరఫరా చేసి తాగునీరు అందేలా చూడాలి.

– కాశీ అనసూయ, డోకులపాడు

Leave a Reply

Your email address will not be published.

//]]>