జగన్ పట్టించుకోకపోతే పార్టీకి రాజీనామా..!

7వ రోజు ‘వేపకాయల బతుకమ్మ’..
October 15, 2018
సొమ్ము ఖాళీ..!
October 17, 2018

జగన్ పట్టించుకోకపోతే పార్టీకి రాజీనామా..!

జగన్ పట్టించుకోకపోతే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం

 

  • పాడేరు వైసీపీలో అసమ్మతి పోరు
  • సమన్వయకర్తగా విశ్వేశ్వరరాజుగా నియామకంపై తీవ్ర అసంతృప్తి
  • ఒక్కటైన భాగ్యలక్ష్మి, మాధవి వర్గీయులు
  • చింతపల్లిలో భారీ సమావేశం
  • హాజరైన ఐదు మండలాల ముఖ్యనేతలు
  • భాగ్యలక్ష్మి లేదా మాధవికి పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్
  • అధినేత పట్టించుకోకపోతే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం
పాడేరు నియోజకవర్గం వైసీపీలో గ్రూపుల గోల మళ్లీ మొదలైంది. సమన్వయకర్తగా ఇటీవల నియమితులైన మత్స్యరాస విశ్వేశ్వరరాజుకు వ్యతిరేకంగా, మాజీ సమన్వయకర్త కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మద్దతుదారులు, అరకు పార్లమెంటు సమన్వయకర్త గొడ్డేటి మాధవి వర్గీయులు మంగళవారం చింతపల్లిలో జడ్పీ అతిథిగృహంలో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పలువురు నేతలు హాజరైనట్టు తెలిసింది.
 
పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత వైసీపీకి పెద్ద దిక్కు లేకుండాపోయింది. పార్టీని ముందుకు నడిపించేవారు లేకపోవడంతో కేడర్‌లో నిస్తేజం నెలకొంది. దీంతో అధినేత జగన్‌…. కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిని సమన్వయకర్తగా నియమించారు. కానీ అప్పటికే పార్టీలో సీనియర్లుగా వున్న చింతపల్లి జడ్‌పీటీసీ సభ్యురాలు పద్మకుమారి, జి.మాడుగుల, పాడేరు మాజీ ఎంపీపీలు గంగరాజు, రమణ, తదితరులు వ్యతిరేకిస్తూ, అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు ఎనిమిది నెలల నుంచి వీరెవరూ పార్టీ కార్యక్రమాల్లో భాగ్యలక్ష్మితో కలిసి పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్ఠానం అనూహ్యంగా భాగ్యలక్ష్మి స్థానంలో జి.మాడుగులకు చెందిన మత్స్యరాస విశ్వేశ్వరరాజును సమన్వయకర్తగా నియమించింది. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే దేముడు కుమార్తె మాధవిని అరకు పార్లమెంట్‌ సమన్వయకర్తగా నియమించింది. దీంతో ఆమెను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కానీ వాస్తవంగా మాధవి అసెంబ్లీ టిక్కెట్టును ఆశిస్తున్నారు. ఈ పరిస్థితిలో పాడేరు సమన్వయకర్తగా మత్స్యరాస విశ్వేశ్వరరావును నియమించడం భాగ్యలక్ష్మి, మాధవి వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.
 
అరకు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్‌, ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు భీమరాజు, ప్రధాన కార్యదర్శులు జోగినాయుడు, గుణబాబు, పాడేరు మండల అధ్యక్షుడు సింహాచలం, కొయ్యూరు మండల అధ్యక్షుడు సూరిబాబు, జీకేవీధి అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్‌, చింతపల్లి అధ్యక్షుడు మోరి రవి, రాష్ట్ర కార్యదర్శి వారా నూకరాజు, నాయకులు దాసు, ఉల్లి సత్యనారాయణ, బోయిన సత్యనారాయణతోపాటు సుమారు వంద మంది వరకు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమన్వయకర్తల మార్పు విషయంలో అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీని నమ్ముకున్న వారికి సుముచిత స్థానం కల్పించడంలేదని, మాధవి, భాగ్యలక్ష్మిల్లో ఎవరో ఒకరిని పాడేరు సమన్వయకర్తగా నియమించాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానించినట్టు సమాచారం. అధినేత జగన్‌ స్పందించకపోతే, పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కాగా ఈ సమావేశానికి మాధవి హాజరుకాలేదు. భాగ్యలక్ష్మి సాయంత్రం చింతపల్లి వచ్చినప్పటికీ సమావేశంలో పాల్గొనలేదు.

Leave a Reply

Your email address will not be published.

//]]>